- ఏఐటియూసి నేత బాదుల్లా
వేంపల్లె:కార్మికులను రాజకీయాలతో ముడి పెట్టోద్దని, చిరు కార్మికులపై కక్ష్య సాధింపు మానుకోవాలని ఏఐటియూసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కెసి.బాదుల్లా అన్నారు. మంగళవారం స్థానిక జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలు ఆహ్వానిస్తామన్నారు. అయితే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, వివిధ ప్రభుత్వ పథకాల్లోని అంగన్వాడీ, ఆశా, హాస్టల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, చిరు కార్మికులను తొలగించి, తమ వాళ్ళను నియామిస్తామనడం శోచనీయమన్నారు. అలాంటి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. ఏ ప్రభుత్వం వచ్చినా కార్మిక హక్కులను కాలరాయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. గత ప్రభుత్వం మాదిరి ఉండదని సిఎం చంద్రబాబు మాటలు కింది స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రామంజనేయులు, లింగన్న, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

