పోరుమామిళ్ల:
రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయు) రాష్ట్ర అదనపు ప్రధానకార్యదర్శిగా పి.రమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రీజనల్ కన్వీనర్ వి.వి.క్రిష్ణారెడ్డి, కోకన్వీనర్ ఆర్.రమణ తెలిపారు. శని,ఆదివారాలలో పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నందు జరిగిన రాష్ట్రకౌన్సిల్ సమావేశాల యందు జరిగిన నూతన రాష్ట్రకార్యవర్గ ఎన్నికలలో మన పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన రమణారెడ్డి రాష్ట్ర అదనపు ప్రధానకార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికకావడం హర్షించదగ్గ విషయమన్నారు. గతంలో కలసపాడు మండలశాఖ అధ్యక్షుడిగా,జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడుగా, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడుగా, రాష్ట్రకౌన్సిలర్ గా,రాష్ట్రకమిటీ కన్వీనర్ గా,రాష్ట్రకార్యదర్శిగా,జిల్లా అధ్యక్షుడిగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రమణారెడ్డి విశేష కృషి చేశారన్నారు. అదేవిధంగా పోరుమామిళ్ల ప్రాంతంతో పాటు,కడప జిల్లాలో ఎస్టీయు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాడన్నారు.పోరుమామిళ్ల ప్రాంతంలోని ఉపాధ్యాయలోకానికి తలలో నాలుకవలె ఉండి, వృత్తిపరమైన సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా అందుబాటులో ఉండి, అందరివాడుగా పేరొందాడన్నారు. అంతేకాక సర్వీసు పూర్తయి లేదా వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబసభ్యులకు రావలసిన ఆర్థికపరమైన ప్రయోజనాలు సకాలంలో మంజూరు చేయించడంలోనూ మరియు కారుణ్యనియామకం క్రింద ఉద్యోగాలు రావడంలోనూ వారికి సహాయసహకారాలు అందజేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడన్నారు. అటువంటి నాయకుడికి రాష్ట్రకార్యవర్గంలో సముచిత స్థానం లభించడం ఆనందదాయకమన్నారు.
నూతనంగా రాష్ట్ర అదనపు ప్రధానకార్యదర్శిగా ఎన్నికైన రమణారెడ్డి మాట్లాడుతూ,పెండింగ్ లో ఉన్న పలు సమస్యల పరిష్కారంతో పాటు,ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్ కు గొడ్డలిపెట్టుగా పరిణమించిన సిపియస్ ను రద్దు చేసి ఓపియస్ ను అమలు చేసే వరకు పోరాడుతామన్నారు. ప్రభుత్వ విద్యారంగానికి పెనుముప్పులా దాపురించిన జివో నెంబరు 117ను రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.లేకపోతే ప్రభుత్వ విద్యారంగం కూకటివేళ్లతో సహా పెకిలించబడి,పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యకు దూరమయ్యే అవకాశం ఎంతో దూరంలో లేదన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి, కుటుంబఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా పీఆర్సీ,ఐఆర్,డిఎలు,హెచ్ఆర్ఎలు ఇవ్వాల్సిన బాధ్యతను నేటి ప్రభుత్వాలు విస్మరించి,ఉద్యోగుల పట్ల నిరంకుశ విధానాన్ని అవలంబించడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు.అదే విధంగా బకాయిల చెల్లింపులోనూ,రుణాల చెల్లింపులోనూ అనుసరిస్తున్న మొండివైఖరి ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి,ప్రభుత్వ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ఉద్యోగులను విస్మరించడం మంచిది కాదన్నారు.వెంటనే ప్రభుత్వం ఈ సమస్యల పరుష్కారంపై దృష్టి సారించాలన్నారు. లేకపోతే జెఎసి ఉద్యమ కార్యాచరణతో తగు బుద్ధి చెప్పడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారన్నారు.