కడప సిటీ
రాష్ట్రవ్యాప్తంగా ఐఎంల్ డిపోలో పనిచేస్తున్న బేవరేజ్ హమాలీ కార్మికులకు ఎగుమతి రేట్లు అక్టోబర్లో పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, హామీని వెంటనే అమలు చేయాలని కడప ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలోధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావడంలో ఎక్సైజ్ శాఖ ప్రధానమైనటువంటి ఆదాయ వనరు అని తెలిపారు. అందులో బేవరేజ్ హమాలీలు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కు ఎగుమతి చేయడం దిగుమతి చేయడంలోనూ కీలకపాత్ర హమాలీలు పోషిస్తున్నారని తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారులు 2023 అక్టోబర్ నెల చివరి లోపు పెంచుతామని తెలిపారు. మరల డిసెంబర్ 15వ తేదీ లోపు కచ్చితంగా పెంచుతామని తెలిపారని గుర్తు చేశారు. 2024 ఫిబ్రవరి దాటిన ఎక్సజ్ అధికారులు ప్రభుత్వం పెంచకపోవడం వల్ల డిపోల వద్ద ధర్నా చేయాల్సిన అవసరం వచ్చిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. ఐఎంఎల్ కడప డిపో వద్ద హామాలీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటారని తెలిపారు. బాటల్స్ దించడంలో ఎత్తడంలో ప్రమాదం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాద బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. హమాలిల ఎగుమతి రేట్లు పెంచకపోతే సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నాలుగో తేదీ ఆందోళన చేస్తామని తెలిపారు. ఐ ఎం ఎల్ బేవరేజ్ హమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూఎక్సైజ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. డిపో గౌరవ అధ్యక్షులు పి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ హమాలీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కే రఘురామయ్య, జి రెడ్డి ప్రసాద్, ఎన్ వి సుబ్బారెడ్డి, ఎన్ సుబ్బారెడ్డి, పివి రమణ, పిఓ కొండారెడ్డి ,ఏ నరేష్, ఎన్ మదన్ ,ఎల్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.