ప్రొద్దుటూరు
వైసిపి అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు, ఈనెల 15 తేదీ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఉదయం నడింపల్లి లోని సమితి ఆఫీస్ దగ్గరలో ఉన్న మాజీ కౌన్సిలర్ చింతకుంట జయ లింగారెడ్డి నివాసం వద్ద మునిసిపల్ కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో రాచమల్లు మాట్లాడుతూ పేదలకు పథకాల లబ్ధి అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేశామని, తమ ప్రభుత్వానికి అనుకూలమని నియోజకవర్గ పరిధిలో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో పార్టీలోని అందరి నాయకులను, కార్యకర్తలను కలుపుకొని ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వర్గ పోరు వల్ల తమకు అనుకూలమని ప్రజా సమస్యల పైన టిడిపి పార్టీ ప్రజా సమస్యల పైన ఏనాడు పోరాటం చేయలేదని తెలిపారు. టిడిపి నాయకులు రాజకీయాలను పదవులుగా భావిస్తున్నారని, ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు.తాను ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటూ చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఏకపక్షంగా వైసిపి అభ్యర్థిగా తనను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. గత 15 రోజుల నుండి తమ వైసిపి పార్టీకి చెందిన కౌన్సిలర్లను టిడిపి నాయకులు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారని, దాదాపు 15 మంది కౌన్సిలర్లను వారి దగ్గరికి వెళ్లి 12.5 లక్షల డబ్బులు ఇస్తామని వారిని ఒత్తిడి చేసి బెదిరించి, ప్రలోభాలు పెట్టారన్నారు. ఇలాంటి పనులు టిడిపి నాయకులు మానుకోవాలని, టిడిపి నాయకుల కోరిక నెరవేరలేదని, ఎప్పటికీ వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు, మిగతావారు తమ వెంట ఉండాలని తెలిపారు. ఈ సంఘటన విషయమై ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. స్థానిక టిడిపి నాయకులు 30 కోట్లు డబ్బు చూపిస్తే టిడిపి అధిష్టానం అసెంబ్లీ టికెట్ ఖరారు చేస్తున్నారని, స్థానిక నాయకత్వం వారికి సహకరించే విధంగా నాయకుల కొనుగోళ్ల సాగుతుందని ఆయన ఆరోపణ చేశారు. తమ కౌన్సిలర్లను కొనుగోలు చేసే ప్రయత్నం మానుకోవాలని టిడిపి నాయకులకు విజ్ఞప్తి చేశారు. మరోమారు ఇదే జరిగితే దండన తప్పదని వారికి హెచ్చరించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ వైస్ చైర్మన్లు, ఇద్దరు మండలాధ్యక్షులు, కౌన్సిలర్లు, డైరెక్టర్లు, ఇతర నాయకులు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.