జిల్లాలో 605 సచివాలయాల పరిధిలో 245 క్రీడా మైదానాల్లో ఆడుదాం ఆంధ్రా పోటీలు
- ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల విజవంతానికి కృషిచేయండి
- అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్
క్రీడాకారుల్లో దాగియున్న ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేంకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు విజయవంతానికి కృషిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ అధికారులను కోరారు.
డిసెంబర్ 15వ తేదీ నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ హాల్‌లో జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పోటీలను నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలో 245 క్రీడా మైదానాల్లో క్రికెట్, వాలీబీల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి ప్రముఖ క్రీడలతో పాటు స్థానిక ప్రాధాన్యమున్న క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించేందుకు క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రతి గ్రామం నుంచి ఏదో ఒక క్రీడలో క్రీడాకారులు తప్పనిసరిగా పోటీలో పాల్గొనెలా చేయాల్సిన బాధ్యతను స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడాకారులు 1902 నంబర్‌కు కాల్‌చేసి లేదా తమ సమీపంలోని సచివాలయం నందు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడలకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో రూ. 35 వేలు ప్రథమ బహుమతి, రూ. 15 వేలు ద్వితీయ బహుమతి, రూ. 5 వేలు తృతీయ బహుమతిని.. జిల్లాస్థాయిలో రూ. 60 వేలు ప్రథమ, రూ. 30 వేలు ద్వితీయ, రూ. 10 వేలు తృతీయ బహుమతిగానూ రాష్ట్రస్థాయిలో రూ. 5 లక్షలు ప్రథమ, రూ. 3 లక్షలు ద్వితీయ, రూ. 2 లక్షలు తృతీయ బహుమతులుగా క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు తెలిపారు. బ్యాడ్మింటన్ డబుల్స్‌కు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో రూ. 20 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలు.. జిల్లాస్థాయిలో రూ. 35 వేలు, రూ. 20 వేలు, రూ. 10వేలు; రాష్ట్రస్థాయిలో రూ. 2 లక్షలు, రూ. లక్ష, రూ. 50 వేలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా అందజేయడం జరుగుతందని వివరించారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులకు అవసరమైన క్రీడా పరికరాలను అందజేయడం జరుగుతోందన్నారు. పోటీల నిర్వహణకు సంబంధించి 1210 టెన్నీక్వాయిట్ రింగ్‌లు, స్టేజ్ 1 వాలీబాల్ క్రీడల నిర్వహణకు 1815 వాలీబాల్స్, 605 నెట్‌లు, స్టేజ్ 2 వాలీబాల్ పోటీలకు 80 బాల్స్; స‌్టేజ్ 1 బ్యాడ్మింటన్‌కు రాకెట్లు 3630, 605 నెట్లు; నైలాన్ కాక్స్ 1815, బ్యాడ్మింటన్ స్టేజ్-2కు 160 రాకెట్లు, 270 కాక్స్, కబడ్డీ పోటీలకు 700 నీ క్యాప్స్, 700 యాంకిల్స్; క్రికెట్ పోటీల నిర్వహణకు 1815 బేసిక్ బాల్స్, ప్రొఫెషనల్ ఎస్‌జీ 60, లెదర్ బాల్స్ 54 తదితర క్రీడా సామాగ్రి ఇప్పటికే క్రీడాధికారులకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థకు ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగిందన్నారు. క్రీడాపోటీలను విజయవంతం చేయడం ద్వారా ఆడుదాం ఆంధ్రాలో జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్రీడాప్రాంగణాల వద్ద వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ సూచించారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో డీఆర్‌వో ఎస్‌వీ నాగేశ్వరరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి కొడాలి అనురాధ, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా. ఉషారాణి, క్రీడాప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ అజీజ్, డ్వామా పీడీ జె.సునీత, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, ఉద్యాన అధికారి బాలాజీకుమార్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ జె.సుమన్, గిరిజన సంక్షేమ అధికారి రుక్మాంగదయ్య తదితులు పాల్గొన్నారు.