Sunday, November 9, 2025

Creating liberating content

టాప్ న్యూస్అవినీతి కేంద్రంగా తుడా

అవినీతి కేంద్రంగా తుడా

  • తిరుచానూరు అమ్మవారి గోపురం మించి కట్టడాలకు అనుమతులు
  • కలెక్షన్ ఏజెంట్లుగా మారిన ప్లానింగ్ సెక్షన్ అధికారులు

ప్రజాభూమిబ్యూరో – తిరుపతి (తిరుచానూరు)

తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) ప్లానింగ్ సెక్షన్ అవినీతికి అడ్డాగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్రికల్లో ఎన్నిసార్లు వార్తలు వెలువడినా, పై స్థాయి చర్యలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయని ప్రజల ఆగ్రహం పెరిగిపోతున్నా సంబంధిత శాఖల నిర్లక్ష్యం కొనసాగుతుండటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అమ్మవారి గోపురం కంటే ఎత్తైన భవనాలు

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం గోపురం కంటే ఎత్తైన కట్టడాలు నిర్మాణమవుతున్నా, తుడా అధికారులు కళ్లుమూసుకుని చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఆలయ పౌరాణికత, ఆధ్యాత్మికత దెబ్బతింటుందన్నా, చట్టవ్యతిరేక నిర్మాణాలపై ఎటువంటి చర్యలు లేకపోవడం వెనుక ఉన్న “లోబీ” బహిర్గతమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

సస్పెండ్ అయినవారే తిరిగి పదవుల్లో

గతంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన అధికారులు, కాసులు కట్టబెట్టడం, లాబీయింగ్ చేయడం ద్వారా తిరిగి విధుల్లోకి రావడం గమనార్హం. ఒక్కసారే కాదు, పలుమార్లు అవినీతి మచ్చలు తగిలినా వారినే తుడాలో నియమించడం వెనుక బలమైన రాజకీయ ఆశ్రయం ఉన్నట్లు తెలుస్తోంది.

కలెక్షన్ ఏజెంట్ల దౌత్యం

ఇంతటితో ఆగకుండా, కొంతమంది అధికారులను ప్రత్యేక రిఫరెన్స్‌తో తుడాకు బదిలీ చేయించుకుని, వారిని ‘కలెక్షన్ ఏజెంట్లుగా’ ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ భవనాలు కడితే అక్కడే కాసులు సేకరించి, పై అధికారులకు వాటా చేరేలా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు విసుగెత్తుతున్నారు.

ప్రజల్లో ఆగ్రహం

“అవినీతి కట్టడాలకి తుడా బలమా?” అన్న ప్రశ్న తిరుపతి ప్రజల్లో వినిపిస్తోంది. అధికారుల సడలింపులు, కాసుల దౌత్యం వల్ల పుణ్యక్షేత్ర ప్రతిష్ట చెడిపోతోందని భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుడాలో కొనసాగుతున్న ఈ అవినీతి పై ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article