వి.ఆర్.పురం
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక బ్రిలియంట్ విద్యా సంస్థలు అధినేత బి. ఎన్. ఆర్. అబ్దుల్ కలామ్ స్కూల్ కరెస్పాండెంట్ యం. డి.సాదత్ ను విఆర్ పురం స్కూల్ ఆవరణలో మంగళవారం ఘనంగా సన్మానించారు. అబ్దుల్ కలాం స్కూల్ లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బి.ఎన్. ఆర్ మాట్లాడుతూ మారుమూల ఏజన్సీలో విద్యారంగంలో విశేషమైన కృషి చేస్తూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ, అతి సామాన్య విద్యార్థులను సైతం నవోదయ, గురుకుల వంటి పోటీ పరీక్షలకు తనదైన శైలిలో విద్యార్థులను సిద్ధం చేస్తూ, అందరి మన్ననలను పొందుతూ, గత మూడు దశాబ్దాల నుండి వివిధ విద్యాసంస్థల్లో వందల మంది విద్యార్థులను విద్యావంతులు చేసిన నిగర్వి, నిస్వార్ధపరుడు , మృదు స్వభావి అయిన సాదత్ ను ఒక విద్యాసంస్థల చైర్మన్ గా సన్మానించడం నాకు చాలా గర్వంగా ఉందని అన్నారు. 1989 నుండి వివిధ విద్యా సంస్థలైన ప్రభుత్వ జూనియర్ కళాశాల కూనవరంలో, భద్రాచలం త్రివేణి జూనియర్ కాలేజిలో, సాయి ప్రశాంతి డిగ్రీ కాలేజి కూనవరంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారని కొనియాడారు. ఆయన వద్ద విద్యనభ్యసించిన వి.ఆర్.పురం , కూనవరం , వేలేరుపాడు , చింతూరు మండలాల విద్యార్థులు మంచి స్థాయిలో స్థిరపడ్డారన్నారు. ఇటువంటి వారు ఈ ఏజెన్సీ లో ఉండడం అదృష్టమని ఈ ప్రాంత ప్రజలు వీరి సేవలు గుర్తించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివేకానంద స్కూల్ ప్రిన్సిపాల్ కె.కృష్ణార్జున రావు మాట్లాడుతూ ఈ ప్రాంత సుపరిచితులు , అపార అనుభవం కలిగిన విద్యా వంతులు వి.ఆర్.పురం లో విద్యాలయం ఏర్పాటు చేసి నడపడం ఈ ప్రాంత వాసుల అదృష్టమని ఈ సన్మాన కార్యక్రమానికి తనుకూడా పాలుపంచుకోవడం తన అదృష్టం గా భావిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యా సంస్థలు కో- ఆర్దినేటర్ కార్తిక్ నాయుడు, అబ్దుల్ కలాం స్కూల్ ప్రిన్సిపాల్ మాదిరెడ్డి.రామ లక్ష్మీ , ఉపాధ్యాయులు రమ్య, లహరి, భవాని, మీనా, తరుణ్, సావిత్రి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

