హిందూపురంటౌన్
ప్రభుత్వ అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహించుకుంటున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలీ మాట్లాడుతూ, ఐకాన్ జూనియర్ కళాశాల నిర్వహణకు ప్రభుత్వ అనుమతులు లేకుండానే ముందస్తు ప్రచారాలు, ఫ్లెక్సీలు, బ్యానర్ల రూపంలో హిందూపురం పట్టణంలో ఏర్పాటు చేసి ప్రచారాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కళాశాలకు భవన సముదాయ వసతి కూడా లేదని, అంతేకాకుండా కళాశాల నిర్వహణకు సంబంధించిన కనీస సౌకర్యాలు కూడా లేకుండానే విద్యాశాఖ అధికారులు అనుమతులు ఇచ్చినారని కళాశాల యాజమాన్యం చెబుతోందన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి కనీస నిబంధనలు పాటించని ఐకాన్ జూనియర్ కళాశాల పైన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామన్నారు. లేనిపక్షంలో ఈ రకంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కళాశాలల ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చంద్రశేఖర్ , తరుణ్ , పవన్ , మహేష్ , భగత్ పాల్గొన్నారు.

