అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీల సమస్యల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సోమవారం రాత్రి అంగన్వాడీ యూనియన్ నాయకులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. రెండు దఫాలుగా అంగన్వాడీలతో చర్చలు జరపగా.. చివరికి ఫలించాయని మంత్రి బొత్స మీడియా సమావేశంలో తెలిపారు. ఈ చర్చల్లో అంగన్వాడీలు ప్రభుత్వం ముందు ఉంచిన 11 డిమాండ్లలో 10 నెరవేర్చేందుకు ప్రభుత్వం తరపున అంగీకారం తెలిపింది. జీతాల పెంపును జూన్ నుంచి అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో అంగన్వాడీలు అంగీకరించారు. దీంతో ప్రభుత్వం, అంగన్వాడీల మధ్య చర్చలు సఫలం అయ్యాయి. మంగళవారం నుంచి అంగన్వాడీలు విధుల్లోకి చేరనున్నారు.